‘ఆకాశంలో ఒక తార’ సినిమా హార్ట్ టచింగ్ ట్రైలర్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిగా పరిచయమవుతున్నారు. శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా కథలోని భావోద్వేగాలను, పాత్రలను మరింత దగ్గరగా పరిచయం చేస్తోంది.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన “మీ కలలు నిజం కావాలంటే ముందుగా మీరు కలలు కనాలి” అనే స్ఫూర్తిదాయకమైన మాటతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ కథలో కల్పన అనే చిన్నారి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె ఆశయాన్ని చుట్టూ ఉన్నవాళ్లు ఎగతాళి చేసినా, తన అమాయకత్వంతో అవేవీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ప్రతి కష్టంలోనూ ఆమెకు అండగా నిలుస్తూ, తన కలను నిజం చేయడానికి కృష్ణ అసాధారణమైన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు, ఓ మిషన్ విఫలం కావడంతో పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఏరోస్పేస్ ఇంజినీర్ రోహిణి రాకెట్ తయారు చేయడానికి సరైన టీమ్ కోసం వెతుకుతుంటుంది.
ఒక చిన్నారి తన పట్టుదలతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని, అసాధ్యమనుకున్న తన కలను ఎలా నిజం చేసుకుందనే కథను పవన్ సాధినేని అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫీల్‌గుడ్ సన్నివేశాలు, మనసును తాకే భావోద్వేగాలు, డ్రామాతో కథను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ జీవితాన్ని, పెద్ద కలలు కనే అమ్మాయిలను సమాజం ఎలా నిరుత్సాహపరుస్తుందనే విషయాన్ని సహజంగా చూపించారు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర కథకు ఎమోషనల్ బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది. కల్పనకు ఆయన ఇచ్చే అండ, ఆమె కలను నిజం చేయడానికి చేసే ప్రయత్నాలు కథలో భావోద్వేగాలను మరింత పెంచుతాయి. దుల్కర్ తన నటనలో చూపించిన సున్నితమైన భావాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కళ్లలో నుంచి కన్నీళ్లు వస్తుండగా కార్ డ్రైవ్ చేసే సన్నివేశం మనసును హత్తుకుంటుంది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తోనే భావోద్వేగాలను పలికించగల తన ప్రత్యేకతను మరోసారి చూపించారు.
సాత్విక వీరవల్లికి ఇది మంచి డెబ్యూ సినిమా కానుంది. కలలు కనే అమాయకమైన పాత్రలో ఆమె చాలా సహజంగా నటించారు. ఆ పాత్రలోని అమాయకత్వం, పట్టుదల, ఆశలను చక్కగా చూపించారు. ఆమె సహజమైన నటన, కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఇది తొలి సినిమా అంటే నమ్మడం కష్టమే. ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ లా నటించారు.
శ్రుతి హాసన్ ఏరోస్పేస్ ఇంజినీర్ పాత్రలో ఆకట్టుకున్నారు. కల్పన తన కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. రుహానీ శర్మ కూడా ట్రైలర్ చివర్లో వచ్చే ఓ ముఖ్యమైన సన్నివేశంలో కనిపించి ఆకట్టుకున్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ శ్వేతా సాబు సిరిల్ రాకెట్‌కు సంబంధించిన సన్నివేశాలతో పాటు సినిమా నేపథ్యాన్ని సహజంగా రూపొందించారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ కథలోని భావోద్వేగాలను, విజువల్స్‌ను అందంగా చూపించింది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సన్నివేశాల్లోని డ్రామాను మరింత బలంగా చూపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
ట్రైలర్ చూస్తుంటే ‘ఆకాశంలో ఒక తార’ మనసును హత్తుకునే భావోద్వేగాలతో పాటు, పెద్ద కలలు కనాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పే స్ఫూర్తిదాయకమైన సినిమాగా ఆకట్టుకోనుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20, 2026న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు:
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకత్వం: పవన్ సాధినేని
రచయిత: గంగరాజు గున్నం
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేతా సాబు సిరిల్